Du er ikke logget ind
Beskrivelse
మా నాన్నగారు కీ. శే. దిగవల్లి వేంకట శివరావు గారు (1898-1992) వృత్తిరీత్యా న్యాయవాది గా 40 ఏండ్లు మాత్రమే పనిచేసినప్పటికీ చరిత్ర పరిశోధకులుగా జీవితాంతమూ కృషిచేసి బ్రిటిషు ఇండియా కాలంనాటి అనేక విశేషములు వెలికితెచ్చి వారి రచనల ద్వారా 1928సం. నుండీ 1985 సం. వరకూ ప్రచురించారు. చరిత్ర పరిశోధకులు, రచయితయైన మా తండ్రిగారు వారి పితామహుడు తిమ్మరాజుపంతులు (1794-1856) గారు బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ పరిపాలనాకాలంలో ఉద్యోగరీత్యా నిర్వహించిన బాధ్యతలు, కార్యనిర్వాహణ రిపోర్టులు, నివేదికలు అధికారికముగా ప్రచురితమైనవినూ, తమ తండ్రి (వెంకటరత్న 1850-1908) గారి డైరీలునూ, 1856సం.లో వ్రాయబడిన విలునామాతో సహా సేకరించి వారి పితామహుని జీవిత చరిత్ర రచించారు. ఈ జీవిత చరిత్రలో కేవలము వ్యక్తిగత విశేషములే కాక ఆనాటి అనేక చారిత్రక విశేషములు సమకూర్చారు(ఆనాటి బ్రిటిషు ఈస్టుఇండియా కంపెనీ ప్రభుత్వపు పరిపాలనా యంత్రాంగము, ఉత్తర సర్కారులు, రాజమండ్రీ, మచిలీ పట్నం జిల్లాల లో రివిన్యూశాఖ విశేషాలు, దేశీయ ఉద్యోగుల స్దితి గతులు, తాలూకాల విభజన, శిస్తు అమరక పద్దతి, వ్యవస్ద, గోదావరి ఆనకట్ట, పిఠాపురం, నూజివీడు జమీందారీలు మున్నగు విశేషములు కూడా కలవు).